Tuesday, March 22, 2011

అంకుల్ @ 28

నా బైక్‌ని వెనకనుంచి ఇంకో వెహికిల్ ఢీ కొట్టేసరికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెనక్కి చూశాను.
‘సారీ అంకుల్’ పరిచయమున్న పదం. నాకు పరమ చిరాకు తెప్పించే అదే పదం అం...కు..ల్.....
‘సారీ అంకుల్’ ఇంకోసారి రెట్టించింది.

‘యూ...ఇడియట్’ కసిగా తిట్టుకున్నాను. కాని గొంతు దాటి బయటకు రాలేదు ఆ తిట్టు. ఆ కోపాన్ని ఎక్సలేటర్‌మీద చూపించి బైక్ వేగాన్ని పెంచాను ఆ పదం వినిపించనంత దూరంగా వెళ్దామని. అది నా జీవితాంతం వెంటాడుతుందని తెలిసినా...!

ఒకసారి షాపింగ్‌మాల్‌లో షాపింగ్ చేస్తుంటే.... ఓ గంట వెదికాక నచ్చిన టీ షర్ట్ తీసుకుని ట్రయలర్ రూమ్‌కి వెళ్లబోతుండగా అమ్మ ఫోన్ చేసింది.కాస్త పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుతుండగా ఎదుగా ఓ అమ్మాయి. పాతికేళ్లుంటాయి. వావ్...భలే ఉందే అని నా పురుష సెన్స్ ఆస్వాదించేలోపే ‘ఎక్స్‌క్యూజ్ మీ అంకుల్’ అని ఆగింది. అంతే ఆ మాట వినగానే అందమైన ఆ అమ్మాయి కాస్త రెండు కోరలు, రెండు కొమ్ములతో భయంకరమైన రాక్షసిగా కనిపించింది.
చిరాగ్గా ‘ఎస్‌‘ అంటూ తనకు దారిస్తూ పక్కకు తప్పుకున్నాను.

దూరపు బంధువుల పెళ్లిలో....‘అలేఖ్యా... మా రమణ గుర్తుంది కదా...వాళ్లబ్బాయి’ అంటూ 23 ఏళ్ల(బహుశా)ఓ బ్యూటిఫుల్ గాళ్‌కి పరిచయం చేసింది మా అమ్మ ఫ్రెండ్ గిరిజాంటి. ఆ అమ్మాయి గుర్తొచ్చినట్టూ కాక, గుర్తురానట్టూ కాక అమోమయమైన ఎక్స్‌ప్రెషన్ ఒకటి ఇచ్చి నవ్వింది పలకరింపుగా. నేనూ నవ్వాను. అకస్మాత్తుగా ఓ గుంపు వచ్చి గిరిజాంటిని పలకరించడంతో హడావుడి పడిపోతూ ఏదో చెప్తుందామె వాళ్లకు. నేను, ఆ అమ్మాయి ఆ గుంపు నుంచివిడివడి ఓ పక్కగా నిలబడ్డాం. ఇంతలోకి నలుగురైదుగురు అమ్మాయిలు వచ్చి...‘ఏమే..ఇక్కడున్నావా? ఇందాకటి నుంచి స్టేజ్ మీద వెదుకుతున్నాం నీ కోసం’ అని ఆగారు నాకేసి చూస్తూ. ‘ఎవరితను’ అన్నట్టుంది ఆ చూపుల అర్థం.

‘మీ పేరేంటి అంకుల్?’ అలేఖ్య అనబడే దయ్యం ప్రశ్న ( నా గురించి వాళ్లకు చెప్పడానికి అడిగి ఉంటుంది నా పేరు).
అప్పటిదాకా కోమలంగా ఉన్న అలేఖ్య మొహంలో గడ్డాలు, మీసాలు, బట్టతల కనిపించాయి నాకు ఫోటోషాప్ ఎఫెక్ట్‌తో.
ఈ సంఘటనలన్నీ గుర్తొచ్చి నా కడుపు రగిలిపోయింది. ఆ మంటతోనే ఇల్లు చేరాను. రిఫ్రెష్ అవుతుంటే అవే మాటలు..నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అద్దం ముందు నిలబడ్డాను. చురుకైన నా కళ్లు... కోటేరులాంటి నా ముక్కును డామినేట్ చేస్తూ నా బట్టతల కనిపిస్తోంది కొట్టొచ్చినట్టుగా.... నన్ను వెక్కిరిస్తూ....అద్దంలో.
‘ హు...అంకుల్’ అనుకున్నాను కసిగా.. 28 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నాకు గిఫ్ట్స్‌గా ఇచ్చిన పొట్టను, బట్టతలను నిమురుకుంటూ!

(ఎక్స్‌టెన్షన్)
జ్యూస్ తాగుతూ పొద్దున చప్పరించి వదిలేసిన న్యూస్ పేపర్‌ని నమిలి మింగుదామని సోఫాలో రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను న్యూస్‌పేపర్‌ని చేతిలోకి తీసుకుంటూ.
ఇంతలోకి కాలింగ్ బెల్ మోగింది.
వెళ్లి డోర్ తీద్దును కదా....‘అంకుల్..మీ బాల్కనీలో క్రికెట్ బా్ పడింది’ అంటూ మా పక్క ఫ్లాట్‌లోని ఇంటర్ చదివే కుర్రాడు ప్రత్యక్షమయ్యాడు.
‘బాల్ లేదు గీల్ లేదు పో అవతలకి’ అంటూ వాడి మొహం మీదే తలుపేశాను విసురుగా).